Birth Death Registration Rules India: పుట్టిన తేదీ మరియు మరణించిన తేదీ నమోదు విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదుకు సంబంధించిన ఆలస్యంగా జరిగే నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026’ (Registration of Births and Deaths (Amendment) Bill, 2026) అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) విడుదల చేశారు. పార్లమెంటు ఉభయ సభలు (Both Houses Of Parliament) ఈ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఇది చట్ట రూపం దాల్చింది. ఇప్పుడు చట్టంలోని సెక్షన్ 1లోని ఉప-సెక్షన్ (2) ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, 2026 అక్టోబర్ 1 ని ఈ చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ గా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ సవరణ ఎందుకు అవసరమైంది?
జనన, మరణాల నమోదు చేయడంలో ఆలస్యం జరిగే సందర్భాల్లో అనుసరించాల్సిన ప్రక్రియను మరింత స్పష్టంగా, క్రమబద్ధంగా, మార్చేందుకు వీలుగా ఈ సవరణ తీసుకొచ్చారు. ముఖ్యంగా చాలా ఆలస్యంగా జరిగే రిజిస్ట్రేషన్ లలో వివరాల కచ్చితత్వాన్ని నిర్ధారణ (Determining Accuracy) చేసేందుకు అధికారుల స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆలస్యంగా జనన లేదా మరణాన్ని నమోదు చేయించుకునే వారికి ఏ అధికారి అనుమతి అవసరమో చట్టంలో మరింత స్పష్టత వస్తుంది.
సామాన్యుల పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- ఈ కొత్త సవరణ చట్టం (Births and Deaths registration act) ప్రధానంగా ఆలస్యంగా జరిగే జనన, మరణాల నమోదు పై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సాధారణంగా నిర్ణీత సమయంలో నమోదు చేసే ప్రక్రియకు ఈ మార్పులు వర్తించవు.
- చట్టం ప్రకారం, జననం లేదా మరణం జరిగి ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేయాల్సిన సందర్భాల్లో ప్రత్యేక ధ్రువీకరణ, అధికారుల ఆదేశాలు అవసరం అవుతాయి.
- ముఖ్యంగా రెండు సంవత్సరాలు దాటిన తర్వాత జనన ధ్రువీకరణ లేదా మరణాన్ని ధ్రువీకరణ ను నమోదు చేయాలంటే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (Judicial Magistrate First Class) ఆదేశం అవసరమవుతుంది. సంబంధిత వివరాల కచ్చితత్వాన్ని పరిశీలించిన తర్వాతే నమోదు ప్రక్రియ ముందుకు సాగుతుంది.
- అందువల్ల జననం లేదా మరణం జరిగిన వెంటనే, నిర్ణీత సమయంలోనే నమోదు చేయించుకోవడం ఆ కుటుంబాలకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
ఆలస్య నమోదు పై కఠిన నిబంధనలు
ఆలస్యంగా జనన, మరణాల నమోదు చేయించుకునే ప్రక్రియను క్రమబద్ధీకరణ చేయడమే ఈ సవరణ లోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి.
- ఒక సంవత్సరం దాటిన తర్వాత, రెండు సంవత్సరాల లోపు నమోదు చేయాల్సిన సందర్భాల్లో జిల్లా మేజిస్ట్రేట్ (District Magistrate), సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (Sub-Divisional Magistrate) లేదా జిల్లా మేజిస్ట్రేట్ అధీకృత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (District Magistrate Authorized Executive Magistrate) ఆదేశం అవసరం అవుతుంది.
- అదే విధంగా రెండు సంవత్సరాల తర్వాత నమోదు చేయాలంటే జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆదేశం తప్పనిసరి అవుతుంది.
- దీనివల్ల ఆలస్యంగా నమోదయ్యే వివరాలపై మరింత స్థాయిలో పరిశీలన జరిగే అవకాశం ఉంటుంది.
జనన ధ్రువీకరణ డాక్యుమెంట్ ప్రాధాన్యం
జనన ధ్రువీకరణ డాక్యుమెంట్ పాఠశాలలో ప్రవేశాలకు, కొత్త పాస్పోర్ట్ దరఖాస్తుకు, ఆధార్ వంటి గుర్తింపు సంబంధిత అవసరాలు, ఓటర్ నమోదు, వివాహ రిజిస్ట్రేషన్, ప్రభుత్వ సేవలు వంటి అనేక సందర్భాల్లో ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్. అందువల్ల పిల్లలు పుట్టిన తర్వాత నిర్ణీత సమయంలోనే జనన ధ్రువీకరణ ను నమోదు చేయించుకోవాలి. అలాగే కుటుంబంలో మరణం సంభవించినప్పుడు మరణాన్ని కూడా సంబంధిత రిజిస్ట్రార్ వద్ద సమయానికి నమోదు చేయించుకోవాలి.
ఇక ముందు ఏం జరగనుంది?
అక్టోబర్ 1, 2026 నుంచి ఈ సవరణ చట్టంలోని నిబంధనలు (Birth Death Registration Rules) అమలు లోకి రానున్నాయి. దీంతో రాష్ట్రాలు, స్థానిక రిజిస్ట్రేషన్ సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ ప్రక్రియలను విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆలస్యంగా జనన, మరణాల ధ్రువీకరణ ను నమోదు చేయించుకునేవారు కొత్త నిబంధనలను తెలుసుకోవడం అవసరం. ఎన్ని సంవత్సరాల ఆలస్యం జరిగిందనే విషయం ఆధారంగా సంబంధిత అధికారి లేదా మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి కావచ్చు.
కాబట్టి కొత్తగా బిడ్డ పుట్టిన కుటుంబాలు, కుటుంబంలో మరణం జరిగిన వారు జనన, మరణాలను వీలైనంత త్వరగా నమోదు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే అదనపు ప్రక్రియలను, సమయాన్ని నివారించుకోవచ్చు. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ సవరణ ప్రధానంగా ఆలస్యంగా జరిగే జనన, మరణాల నమోదును మరింత క్రమబద్ధీకరించడం, వివరాల కచ్చితత్వాన్ని నిర్ధారించడం పై దృష్టి పెడుతోంది.


Comments
No comments yet. Be the first to comment.